వృద్ధురాలికి సీఎం చంద్రబాబు వీఐపీ దర్శన భాగ్యం.. కబురు న్యూస్,తిరుమల,జులై 08 : కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి చరిత్రలో ఒక అరుదైన,భావోద్వేగ భరిత ఘట్టం ఆవిష్కృతమైంది.తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఒక సాధారణ,పేద భక్తురాలికి అత్యున్నత గౌరవం దక్కింది.చెన్నైకి చెందిన 116 ఏళ్ల శతాధిక వృద్ధురాలు నవనీతమ్మ (సునీతమ్మ) భక్తి ప్రపత్తులతో అలిపిరి కాలినడక మార్గంలోని మెట్లను ఎక్కి స్వామివారి సన్నిధికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ వయసులో కాలినడకన కొండపైకి రావడం
- వృద్ధురాలికి సీఎం చంద్రబాబు వీఐపీ దర్శన భాగ్యం..
కబురు న్యూస్,తిరుమల,జులై 08 :
కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి చరిత్రలో ఒక అరుదైన,భావోద్వేగ భరిత ఘట్టం ఆవిష్కృతమైంది.తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఒక సాధారణ,పేద భక్తురాలికి అత్యున్నత గౌరవం దక్కింది.చెన్నైకి చెందిన 116 ఏళ్ల శతాధిక వృద్ధురాలు నవనీతమ్మ (సునీతమ్మ) భక్తి ప్రపత్తులతో అలిపిరి కాలినడక మార్గంలోని మెట్లను ఎక్కి స్వామివారి సన్నిధికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ వయసులో కాలినడకన కొండపైకి రావడం టీటీడీ చరిత్రలోనే ఇదే మొదటిసారిగా చెబుతున్నారు.
*ముఖ్యమంత్రి ఆదేశంతో వీఐపీ ప్రోటోకాల్*
ఈ అసాధారణ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తక్షణమే స్పందించారు.సునీతమ్మను ప్రత్యేక వీఐపీగా పరిగణించి,ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.
*ఆలయ అధికారుల ప్రత్యేక శ్రద్ధ*
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు,సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు.సునీతమ్మ బస చేసిన గది నుంచి ఆమెను ప్రత్యేక వాహనంలో ఆలయం వద్దకు తీసుకొచ్చారు.ఐదుగురు టీటీడీ సిబ్బంది స్వయంగా తోడుగా ఉంటూ,ఉద్యోగుల ప్రవేశద్వారం గుండా ఆమెను ఆలయంలోనికి తీసుకెళ్లారు.
*జన్మ ధన్యమైందన్న వృద్ధురాలు*
స్వామివారి ప్రత్యేక సేవలో ఆమెను ఒంటరిగా కూర్చోబెట్టి,స్వామివారిని కళ్లారా వీక్షించే భాగ్యాన్ని కల్పించారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి,శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ అరుదైన గౌరవంపై సునీతమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.ఈ వయసులో శ్రీవారిని ఇంత దగ్గరగా దర్శించుకోవడం,అధికారులు ఇంతగా ఆదరించడం తన పూర్వజన్మ సుకృతమని,తన “జన్మ ధన్యమైంది” అని ఆమె ఆనందాశ్రువులతో పేర్కొన్నారు.














Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *